Karnataka: చాలా దైన్యస్థితి... నా కుటుంబాన్ని ఆదుకోండి: కుమారస్వామిని వేడుకున్న కన్నడ హీరోయిన్

  • కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరద
  • మడికెరెలో తన కుటుంబం చిక్కుకుందన్న నటి దిశా పూవయ్య
  • వారిలో గర్భిణీ ఉందని, వైద్య సహాయం కావాలని వినతి

కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు సరిహద్దుల్లోని కర్ణాటకకూ విస్తరించడం, కరావళి, మల్నాడు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో, వేలాది మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది ఆచూకీ తెలియరావడం లేదని సమాచారం.

ఇక మడికెరెలో తన కుటుంబం చిక్కుకుందని, వారిని రక్షించాలని కన్నడ హీరోయిన్ దిశా పూవయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేసింది. వారు కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేని దైన్య స్థితిలో ఉన్నారని, వారిలో ఓ గర్భిణీ కూడా ఉందని దిశ పేర్కొంది. ఆమెకు వైద్య సహాయం అత్యవసరమని వేడుకుంది.

కాగా, నిరంతరం వర్షం కురుస్తుండటంతో కొడగు, దక్షిణ కన్నడ, ఉడుపి, హసన్, చామరాజనగర్, శివమొగ్గ జిల్లాలను వరద ముంచెత్తింది. మంగళూరు, మడికెరి రహదారిలో కొండ చరియలు విరిగి పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీర్థనదులుగా పేరున్న రామ, లక్ష్మణ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కావేరీ నదిపై ఉన్న కేఎస్ఆర్ జలాశయంలోకి లక్ష క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

More Telugu News