Andhra Pradesh: ఏపీకి కేంద్రం మరో ఝలక్.. వాటర్ షెడ్ పథకానికి నిధుల నిలిపివేత!

  • వాటర్‌షెడ్ పథకానికి నిధులు కట్
  • అగమ్య గోచరంగా పథకం పరిస్థితి
  • ఉద్యోగుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం మరో షాకిచ్చింది. నీటి సంరక్షణ, పొదుపు కోసం ఆయా రాష్ట్రాలు చేపడుతున్న వాటర్‌షెడ్ పథకానికి నిధులు నిలిపివేసింది. కొత్తగా మంజూరైన ఆరో బ్యాచ్ వాటర్‌షెడ్లను సొంత నిధులతోనే జరుపుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఫలితంగా ఏపీలో ఇప్పుడీ పథకం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నిజానికి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ అత్యధికంగా సత్ఫలితాలు ఇస్తున్నది మాత్రం ఏపీలోనే.

కేంద్రం నిర్ణయంతో పథకం ఆగిపోతే ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉండడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ప్రస్తుతం 790 మంది ఉద్యోగులు ఈ పథకంలో పనిచేస్తున్నారు. మొదట్లో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తి కావడంతో వీరంతా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతేనే వీరికి మళ్లీ పని ఉంటుంది. ఇటువంటి సమయంలో కేంద్రం నిధులు ఆపేయడంతో వారంతా ఉద్యోగాలు ఊడతాయన్న ఆందోళనలో ఉన్నారు. వాటర్‌షెడ్‌ సిబ్బందికి ఏడాదికి రూ. 1.20 కోట్లు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడీ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

More Telugu News