Pakistan: తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం కండి.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు

  • తెలంగాణలో శాసనసభ ఎన్నికలపై చర్చ
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్
  • సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో బహిరంగ సభ

తెలంగాణలో శాసనసభ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ ముఖ్యనేతలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వ్యూహాత్మక చర్చలు జరిపారు. తెలంగాణలో ఏ క్షణాన ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి వీలుగా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయాలని  పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు పార్టీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను కొద్ది రోజులలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కోఆర్డినేషన్ కమిటీ, జిల్లా కమిటీల  నియామకాన్ని వెనువెంటనే ప్రారంభిస్తుందని, ఈ మొత్తం ప్రక్రియ రెండు మూడు వారాల్లో పూర్తి చేస్తుందని తెలిపారు.

కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాలో ‘జనసేన’తో కలిసి పోటీ చేస్తామని చేసిన ప్రకటనలు ఈ సమావేశం దృష్టికి వచ్చాయి. ముందు పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నం అవుదామని పవన్ కల్యాణ్ సూచించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని ఆయనకు తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేయగా, ఈ అంశంపై రాబోయే సమావేశాల్లో చర్చిద్దామని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ‘జనసేన’ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పదిహేను లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలని వారికి పవన్ సూచించారు. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో జనసేన పార్టీ కార్యకర్తలతో భారీ సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరగనున్న ఈ సభకు సన్నాహాలు చేయాల్సిందిగా తమ పార్టీ నేతలకు పవన్ సూచించారు.

More Telugu News