Infosys: సిఎఫ్ఓ ఎండి రాజీనామాపై స్పందించిన ఇన్ఫోసిస్ మూర్తి

  • ఆయన నిష్క్రమణ పూరించలేనిలోటు 
  • పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకున్న లీడర్ 
  • ఆయనతో 15 ఏళ్లు కలసి పనిచేసానన్న మూర్తి 

ప్రముఖ ఐటీ సంస్థ ఇ‍న్ఫోసిస్‌ నుంచి  సిఎఫ్ఓ ఎండి రంగనాథ్‌ వైదొలగడంపై సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. కంపెనీకి చాలా కీలకమైన వ్యక్తి దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. రంగనాథ్ రాజీనామాపై ఆయన విచారాన్ని వెలిబులిచ్చారు.  క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇన్ఫోసిస్ కు ఆయన నిష్క్రమణ పూరించలేని లోటన్న నారాయణమూర్తి, భారతదేశంలో అత్యుత్తమ సీఎఫ్‌వోగా, అరుదైన వ్యక్తిగా రంగనాథ్‌ను అభివర్ణించారు.

రాజీవ్ బన్సల్ నిష్క్రమణ అనంతరం 2015లో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ అనతికాలంలోనే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో ఆయన కీలక పాత్ర  పోషించారంటూ మెచ్చుకున్నారు. రాజీవ్ బన్సల్ వంటి మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందజేసిన ప్యాకేజీలు, కార్పొరేట్ పాలనలాంటి అంశాల్లో గత ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్‌తో విభేదించిన నారాయణ మూర్తి తాజా వ్యాఖ‍్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 చట్టం, గవర్నెన్స్‌, ముఖ్యమైన ఖాతాదారులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, డెలివరీ టీమ్స్‌, ఉద్యోగి ఆకాంక్షలు, ఫైనాన్స్ లాంటి అన్నింటిని అవగాహన  చేసుకున్న రంగనాథ్ తో తాను15 సంవత్సారాలు కలిసి పనిచేశానని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. దృఢమైన వ్యక్తిత్వం, మర్యాద, మన్నన, నిర్ణయాలు తీసుకునే నేర్పు, ఓర్పు వున్న లీడర్ రంగనాథ్ అని మూర్తి మెచ్చుకున్నారు. ఇన్ఫోసిస్ కు సిఎఫ్ఓ రంగనాధ్‌ రాజీనామా చేసినా , నవంబర్ 16, 2018 వరకు ప్రస్తుత స్థానంలో కొనసాగుతారని తెలిపారు.

More Telugu News