Donald Trump: ట్రంప్‌ తీరుపై ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ల ఆగ్రహం

  • ట్రంప్ పై తిరుగుబాటు ప్రకటించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ లు 
  • సీఐఏ మాజీ చీఫ్ జాన్ బ్రెన్నాన్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చెయ్యటమే కారణం 
  • ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే గొంతు నొక్కేస్తారా అని ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం మాజీ ఇంటెలిజెన్స్అధికారులకు ఆగ్రహం తెప్పించింది. సీఐఏ మాజీ చీఫ్ జాన్ బ్రెన్నాన్ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దుచేస్తూ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులపై మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు మండిపడుతున్నారు. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే చర్యని వారు ద్వజమెత్తారు. బ్రెన్నాన్‌తో ఏకీభవించనంత మాత్రాన అధ్యక్షుడు ట్రంప్ ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయడం గొంతు నొక్కడమే అవుతుందని ట్రంప్ తీరును తప్పు పట్టారు.

అంతే కాక మాజీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు , సీఐఏ డైరెక్టర్లుగా పనిచేసిన 12 మంది సంయుక్తంగా ట్రంప్ కు చాలా ఘాటైన లేఖ రాశారు. సీఐఏ మాజీ డైరెక్టర్లు విలియం వెబ్‌స్టర్, జార్జి టెనెట్, పోర్టర్ గాస్, మైకేల్ హేడెన్, లియాన్ పనెట్టా, డేవిడ్ పెట్రేయస్‌తోపాటు ఇంటెలిజెన్స్ రంగంలోని ఇతర మాజీ సీనియర్లు ఈ లేఖపై సంతకం చేశారు.

బ్రెన్నాన్‌కు జరిగిన అవమానంపై స్పందించిన ఒసామా బిన్‌లాడెన్ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన వైస్ అడ్మిరల్ విలియం హెచ్ మెక్‌రావెన్ తన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ట్రంప్‌ను సవాల్ చేశారు. ట్రంప్ కు రాసిన లేఖలో సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తే ప్రభుత్వ రహస్య పత్రాల పరిశీలనకు అవకాశం ఉండదని, గతంలో సీనియర్ పదవులు నిర్వహించిన వారికి ఇది అవమానంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వివిధ దర్యాప్తుల్లో సాక్ష్యాల కింద ప్రస్తావించాల్సిన పత్రాలు సేకరించడం అసాధ్యమైపోతుంది అనే విషయాలతో పాటు ట్రంప్ నిరంకుశ విధానంపై విమర్శల వర్షం కురిపించారు.

More Telugu News