t-pcc: మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళంగా ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ సమావేశం
  • కేరళలో వరద బీభత్సంపై సానుభూతి తెలిపాం
  • కేరళకు టీ పీసీసీ తరపునా సాయమందిస్తాం

వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్టు టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

 సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేరళలో వరద బీభత్సంపై సానుభూతి తెలిపామని, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళకు తెలంగాణ పీసీసీ తరపున కూడా సాయమందిస్తామని ఉత్తమ్ తెలిపారు. ఈ సమావేశంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు.  

ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేయాలని యూపీఏ హయాంలో నాడు ఒప్పందం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లకు ప్రధాని మోదీ ఒప్పందం చేసుకున్నారని, మొత్తం 36 విమానాలకు అధికంగా ఖర్చు చేసిన విషయం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ఉత్తమ్ తెలిపారు.

More Telugu News