Muslim: హిందువుగా మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నా విడదీశారు: సుప్రీంలో ముస్లిం యువకుడి పిటిషన్!

  • తన భార్యను అప్పగించాలని విజ్ఞప్తి
  • ఆమెను బలవంతంగా నిర్బంధించారని ఆరోపణ
  • ఈ నెల 27న హాజరుపర్చాలని కోర్టు ఆదేశం

ప్రేమకు మతం, కులం అడ్డుకాదంటారు. నచ్చిన అమ్మాయి కోసం ఓ ముస్లిం యువకుడు ఏకంగా మతం మారాడు. అనంతరం ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులతో పాటు కొన్ని హిందుత్వ సంస్థలు భార్యను కలసుకోకుండా నిర్బంధించడంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాయ్ పూర్ కు చెందిన ఇబ్రహీం సిద్ధిఖీ(33) అదే ప్రాంతంలో ఉంటున్న ఓ హిందూ యువతి(23) ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ మూడేళ్ల పాటు కొనసాగింది. అమ్మాయి కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న సిద్ధిఖీ హిందూ మతం స్వీకరించడంతో పాటు ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకున్నాడు. అనంతరం రాయ్ పూర్ లోని ఆర్యసమాజ్ లో మూడు రోజుల తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లకు భయపడ్డ యువతి ఈ విషయాన్ని వారికి చెప్పలేదు.

సరైన సమయం చూసి ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పాలని ఆమె అనుకుంది. వీరిద్దరూ తమ వివాహాన్ని మార్చి 22న రిజిస్టర్ చేయించగా, ఏప్రిల్ 17న అధికారులు సర్టిఫికెట్ జారీచేశారు. జూన్ లో తన పెళ్లి విషయాన్ని యువతి ఇంట్లో చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో సదరు యువతి ఇంట్లో చెప్పకుండా తన భర్త ఇంటికి బయలుదేరింది. కానీ యువతి తండ్రికి బాగా పలుకుబడి ఉండటంతో పోలీసులు మార్గమధ్యంలోనే ఆమెను పట్టుకున్నారు. తిరిగి ఆమెను ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు.

దీంతో అతను ఛత్తీస్ గఢ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా తన ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నానని ఆమె చెప్పింది. అయితే అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు కోర్టులో పెద్దగా రోదించారు. తల్లి అయితే కూతుర్ని కొడుతూ, ఆమెను చంపి తానూ చచ్చిపోతానంటూ ఏడ్చింది. దీంతో వారి భావోద్వేగాలను చూసిన కోర్టు ఈ పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఆమెను భర్త వెంట వెళ్ళమని ఆదేశించలేమని చెబుతూనే, మేజర్ కాబట్టి ఆమె ఇష్టప్రకారమే చేయచ్చని చెప్పింది. అయినప్పటికీ తమ పలుకుబడిని ఉపయోగించిన తల్లిదండ్రులు, భార్యను తన వెంట పంపలేదని వాపోయాడు.    

ఈ నేపథ్యంలో అర్యన్ ఆర్య సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన మామగారితో పాటు హిందుత్వ సంస్థల నుంచి తన ప్రాణాలకు ముప్పుందని కోర్టుకు తెలిపాడు. తన భార్యను బలవంతంగా నిర్బంధించారని ఆరోపించాడు. కేసును విచారించిన ధర్మాసనం బాధితురాలిని ఆగస్టు 27న తమ ముందు ప్రవేశపెట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. అమ్మాయి తన ఇష్టంతోనే వెళ్లిపోయానని చెబితే కనుక పిటిషన్ ను కొట్టేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.  

More Telugu News