Rajinikanth: రజనీకాంత్‌కు పరిపక్వత లేదు.. అళగిరి సామర్థ్యం నాకు తెలుసు: తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు

  • రజనీకాంత్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి
  • ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటారు
  • అళగిరి రాజకీయ వ్యూహాలను ప్రత్యక్షంగా చూశా

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు విమర్శలు కురిపించారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన రజనీకాంత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతి అనంతరం రజనీకాంత్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకేను అన్నాడీఎంకేతో పోల్చడం మానుకోవాలని హితవు పలికారు. డైలాగులు సినిమాల వరకు ఓకే కానీ, నిజ జీవితంలో అవి పనికిరావన్నారు.

అన్నాడీఎంకే, డీఎంకేకు వేర్వేరు విధానాలున్న సంగతిని గుర్తెరిగితే మంచిదన్నారు. రెండు పార్టీలు సూర్య చంద్రుల్లాంటివని మంత్రి అభివర్ణించారు. ఎంజీఆర్‌పై కరుణానిధి ప్రతీకార చర్యలకు పాల్పడడం వల్లే అన్నాడీఎంకే ఆవిర్భవించిందని, తొలుత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని రజనీకి సూచించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వకుంటే ఆందోళనకు దిగేవాడినన్న రజనీ వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. ఆయన మాటలు సమంజసంగా లేవన్నారు. ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న రజనీకాంత్‌కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. జయలలిత సూచించిన మార్గంలోనే తమ ప్రభుత్వం నడుస్తోందని మంత్రి స్పష్టం చేశారు.  

కరుణానిధి మృతి అనంతరం డీఎంకేలో సోదరుల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందన్నారు. ఆ పార్టీలో త్వరలోనే చీలికలు ఖాయమని జోస్యం చెప్పారు. డీఎంకే బహిష్కృత నేత, కరుణానిధి కుమారుడు అళగిరి సామర్థ్యం తనకు తెలుసని పేర్కొన్నారు. అళగిరి సామర్థ్యం, పనితీరు, ఎన్నికల వ్యూహాలను తాను ప్రత్యక్షంగా చూసినట్టు మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు.

More Telugu News