Hyderabad: హైదరాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. వృద్ధ దంపతులను కట్టేసి రూ.50 లక్షల అపహరణ

  • రాజేంద్రనగర్‌లో ఘటన
  • దంపతుల ముక్కు, నోటికి ప్లాస్టర్లు
  • ఊపిరాడక యజమాని మృతి
  • తెలిసిన వారి పనేనని అనుమానం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన దోపిడీ కలకలం రేపుతోంది. వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి చొరబడిన దొంగలు వాళ్ల కాళ్లు, చేతులు కట్టేసి, ముక్కుకి, నోటికి ప్లాస్టర్లు వేసి దోచుకున్నారు. రూ.50 లక్షల నగదు, 50 తులాల బంగారం దోచుకున్నట్టు బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ప్లాస్టర్ వేయడంతో ఊపిరి ఆడక ఇంటి యజమాని మృతి చెందారు.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సిరిమల్లె కాలనీలో రాజేంద్రప్రసాద్ అగర్వాల్ (66), తారమణి (62) నివస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు దీపక్, రోహిత్ ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రాజేంద్రప్రసాద్ గతంలో బేగం బజార్‌లో కిరాణా దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి వెనక నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న దంపతుల కాళ్లు, చేతులను షూ లేసులతో కట్టివేశారు. అరవకుండా నోటికి, ముక్కుకి ప్లాస్టర్లు వేశారు. అనంతరం నగదు, నగలు, మొబైల్ ఫోన్లతో పరారయ్యారు.

ఆస్తమా, గుండె నొప్పితో బాధపడుతున్న అగర్వాల్ ముఖానికి ప్లాస్టర్ వేయడంతో ఆయన ఊపిరి ఆడక మృతి చెందారు. ప్లాస్టర్ వేసే క్రమంలో దిండుతో ముఖాన్ని అదిమి పెట్టడం వల్లే ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కాగా, దొంగలు పరారైన తర్వాత పడక గదిలో నుంచి వంట గదిలోకి పాక్కుంటూ వచ్చిన తారమణి కత్తితో చేతికి కట్టిన తాళ్లను కోసి వేసి బయటకు పరిగెత్తి వెళ్లి సమీపంలోనే ఉండే వైద్యుడు డాక్టర్ ఆదానికి విషయం చెప్పారు. ఆయన వెంటనే బాధితుల కుమారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అందరూ ఇంటికి చేరుకున్నారు.

అయితే, అప్పటికే అగర్వాల్ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన తీరునుబట్టి చూస్తే అది తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వెనక నుంచి దొంగలు వచ్చినట్టు చెబుతుండగా తలుపులు విరగ్గొట్టిన దాఖలాలు లేకపోవడంతో తలుపు పెట్టడం మర్చిపోయారా? లేక పగలే ఎవరైనా వచ్చి లోపల దాక్కున్నారా? అనేది తెలియడం లేదు. దుండగులు నేరుగా వచ్చి బీరువాలోని డబ్బు, నగలను తీసుకెళ్లడం కూడా అనుమానాలను మరింత బలపరుస్తోంది. మహిళ మెడలో ఉన్న బంగారు నగలు, చేతికి ఉన్న గాజులను దుండగులు ముట్టుకోలేదు. వీటన్నింటిని బట్టి చూస్తే ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News