Navjot Singh Sidhu: పాక్ కాబోయే ప్రధానికి గిఫ్ట్ గా కశ్మీరీ శాలువా: సిద్ధూ

  • స్నేహితుడి సంతోషంలో పాలుపంచుకోటానికే పాకిస్తాన్ వచ్చాను
  •  కశ్మీరీ శాలువాను మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ కు బహుమతిగా తెచ్చాను 
  • పాకిస్తాన్ సామరస్యానికి ప్రతీకగా ఇమ్రాన్ ఖాన్ కనిపిస్తున్నాడు 

మాజీ ఇండియన్ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్థాన్ వెళ్లారు. తన స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సిద్ధూ ఆయనకు కశ్మీరీ శాలువాను బహుమతిగా తీసుకెళ్ళారు. ప్రత్యేక ఆహ్వానితునిగా అక్కడికి వెళ్ళిన సిద్ధూ.. ఇమ్రాన్ ఖాన్ తో తనకు మంచి స్నేహం వుందని, పాకిస్తాన్ సామరస్యానికి ప్రతీకగా ఇమ్రాన్ ఖాన్ ను తాను చూస్తునట్టు తెలిపారు.

ఒక రాజకీయనేతగా కాక ఒక స్నేహితుడిగా ప్రేమపూర్వక సందేశంతో పాకిస్తాన్ వచ్చినట్టు చెప్పారు. వాఘా సరిహద్దు ద్వారా లాహోర్‌లో అడుగుపెట్టిన సిద్ధూ అక్కడి నుంచి శనివారం ప్రమాణస్వీకారోత్సవం జరిగే ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. నా స్నేహితుడైన కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతోషంలో పాలుపంచుకోవడానికి వచ్చానని చెప్పిన సిద్ధూ క్రీడాకారులు, కళాకారులు రెండు దేశాలను దగ్గరికి తీసుకురావడంలో సాయపడ్డారని గుర్తు చేసుకున్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి మాటలను గుర్తు చేసుకుంటూ, 'మన పొరుగింట్లో మంట పుడితే ఆ వేడి మనకు తగులుతుంది' అని వాజ్‌పేయి అన్నారని, అందుకే పొరుగువారు కూడా సామరస్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు సిద్దూ. బలహీనతలను బలంగా మార్చుకునే సామర్థ్యం ఇమ్రాన్‌ఖాన్‌కు ఉందన్న ఆయన మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్‌లకు కూడా ఆహ్వానం అందినా.. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు.

More Telugu News