vajpayee: అవును.. గుజరాత్ లో మావల్ల తప్పు జరిగిపోయింది!: మత ఘర్షణలపై వాజ్ పేయి స్పందన

  • గుజరాత్ వల్లే ఓడిపోయామన్న వాజ్ పేయి
  • మాజీ ప్రధాని వ్యాఖ్యలను బయటపెట్టిన నిఘా సంస్థ ‘రా’ చీఫ్
  • ఓటమిలో కూడా హాస్య ధోరణిని వదలలేదని వ్యాఖ్య

దేశాన్ని దిగ్భ్రాంతి పరచిన 2002 గుజరాత్ అల్లర్లపై వాజ్ పేయి ఆవేదన వ్యక్తం చేశారా? దాని కారణంగానే ప్రభుత్వం 2004 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయిందని భావించారా? అంటే భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) మాజీ చీఫ్ అమర్జిత్ సింగ్ దులత్ అవుననే చెబుతున్నారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో షైనింగ్ ఇండియా (భారత్ వెలిగిపోతోంది) అనే నినాదంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.


దులత్ రాసిన ‘Kashmir: the vajpayee years’ పుస్తకంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఎంత తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నా వాజ్ పేయి ముఖంలో నవ్వు మాత్రం చెరిగిపోదని దులత్ అందులో రాశారు. ‘‘ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత నేను వాజ్ పేయిని కలుసుకునేందుకు ప్రధానమంత్రి నివాసానికి వెళ్లాను. ఓడిపోయిన సందర్భంగా ఆయనతో ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. ఇలా జరిగిపోయిందేమిటి సార్? అని అన్నాను. వెంటనే వాజ్ పేయి స్పందిస్తూ.. ‘ఏం జరిగిందో కాంగ్రెస్ వాళ్లకు కూడా అర్థం కావడం లేదు’ అంటూ పెద్దగా నవ్వేశారు.

అంతలోనే వాజ్ పేయి గంభీరంగా మారిపోయారు. ‘మా వల్ల గుజరాత్ లో పొరపాటు జరిగిపోయింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో నేను ఇంకేం మాట్లాడకుండా లేచి వచ్చేశాను’’ అని దులత్ తన పుస్తకంలో చెప్పారు.

More Telugu News