vaj payee: వాజ్ పేయి అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ

  • ఢిల్లీలో కొనసాగుతున్న వాజ్ పేయి అంతిమయాత్ర
  • పాల్గొన్న అమిత్ షా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు నేతలు పాల్గొన్నారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు, వాజ్ పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి మోదీ, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు వెళ్లారు. వాజ్ పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాగా, నెహ్రూ స్మారక స్థలం శాంతి వనం, లాల్ బహుదూర్ శాస్త్రి స్మారకం విజయ్ ఘాట్ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి.

జనసంద్రమైన ఢిల్లీ వీధులు

అభిమాన నేత కడసారి చూపు కోసం అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. వాజ్ పేయి అంతిమయాత్ర వెంట ప్రధాని మోదీ, అమిత్ షా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు తదితర నేతలు నడుస్తున్నారు. 

More Telugu News