బాబుమోహన్ కు నల్లా కనెక్షన్ కట్.. మాజీ మంత్రి ఎంత బాకీ పడ్డారంటే..!

17-08-2018 Fri 13:19
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన అధికారులు
  • బకాయిలు భారీగా పేరుకుపోవడంతో చర్యలు
  • మాదాల రవి ఇంటి కనెక్షన్ కూడా కట్
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ బకాయిలు చెల్లించనివారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబు మోహన్ కు అధికారులు ఈ రోజు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటికి ఉన్న నల్లా కన్షెక్షన్ ను జీహెచ్ఎంసీ అధికారులు కట్ చేసేశారు.

ఈ విషయమై జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగం సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. బాబు మోహన్ తన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్ కు సంబంధించి రూ.4 లక్షలు బకాయి ఉన్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. బాబు మోహన్ తో పాటు సినీ నటుడు మాదాల రవికి అధికారులు ఝులక్ ఇచ్చారు. ఇప్పటివరకూ నల్లా బిల్లులు రూ.3 లక్షలు దాటినా చెల్లించకపోవడంతో ఆయన ఇంటి వాటర్ సప్లైని కూడా అధికారులు నిలిపివేశారు.