Nehru: కాంగ్రెస్ వారు నమ్మాల్సిందే... నెహ్రూ ఫొటో కనిపించకపోతే కల్పించుకున్న వాజ్ పేయి!

  • 1977లో విదేశాంగ మంత్రిగా వాజ్ పేయి
  • పార్లమెంట్ సౌత్ బ్లాక్ లో కనిపించని నెహ్రూ చిత్రపటం
  • అక్కడే పెట్టాలని ఉద్యోగులకు ఆదేశం

వ్యక్తి ప్రాధాన్యం, ప్రాముఖ్యతలను తప్ప, అతను స్వపక్షమా? విపక్షమా? అని పట్టించుకునే అలవాటు లేని వాజ్ పేయి, నెహ్రూ చిత్రపటం పార్లమెంట్ సౌత్ బ్లాక్ లో కనిపించకపోయేసరికి, కల్పించుకుని తిరిగి అక్కడ పెట్టించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్లమెంటులో వెల్లడించారు. ఇది 1977లో వాజ్ పేయి విదేశాంగమంత్రిగా ఉన్న వేళ జరిగింది.

జనతా పార్టీ అధికారంలోకి రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పార్లమెంట్ సిబ్బంది నెహ్రూ చిత్రపటాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. దీన్ని గమనించిన వాజ్ పేయి, దాన్ని అక్కడే ఉంచాలని ఆదేశించారు. "కాంగ్రెస్‌ మిత్రులు ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. సౌత్‌ బ్లాక్‌ లో నేను రోజూ నడిచే దారిలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ ఓ నాడు అది కనబడకుండా పోయింది. ఆ పటం ఏదని సిబ్బందిని అడిగాను. వారి నుంచి సమాధానం రాలేదు. ఎక్కడికి తరలించారో తెలుసుకుని యథాస్థానానికి చేర్చాలని చెప్పాను. తరువాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు" అని వాజ్ పేయి చెప్పడంతో సభ చప్పట్లతో దద్దరిల్లింది.

విమర్శలను సైతం స్వీకరించే గొప్ప వ్యక్తి నెహ్రూ అని పొగిడిన అటల్‌ జీ, 'విన్‌ స్టన్‌ చర్చిల్, నెవిలే చాంబర్లీన్‌ ల వ్యక్తిత్వాలు కలగలుపుకుని పుట్టిన వ్యక్తి నెహ్రూ' అన్న తన విమర్శలను సైతం ఆయన స్వీకరించారని, తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు.

More Telugu News