KCR: నేతలందరూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండండి: తెలంగాణ సీఎం ఆదేశం

  • రాబోయే ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు
  • అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి 
  • సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, రాబోయే ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో, నియోజక వర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారులు, పోలీసుల సహకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్ లో కూడా సీనియర్ అధికారి నేతృత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నచోట అప్రమత్తంగా ఉండాలని కోరారు.

More Telugu News