Atal Bihari Vajpayee: మరింత విషమించిన వాజ్‌పేయి ఆరోగ్యం.. పరామర్శించిన అద్వానీ.. ఆసుపత్రికి పోటెత్తుతున్న నేతలు

  • మరింత క్షీణించిన వాజ్‌పేయి ఆరోగ్యం
  • ఎయిమ్స్‌కు క్యూకడుతున్న నేతలు
  • ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స

బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. తొమ్మిదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. జూన్ నెలలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత 24 గంటలుగా వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వైద్యులను అడిగి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఆయన కుమార్తె ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ కూడా వాజ్‌పేయిని పరామర్శించారు.

వాజ్‌పేయి 2005లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో పోటీచేయబోనని ముందే చెప్పారు. లక్నోనుంచి ఆ ఎన్నికల్లో బరిలోకి దిగిన లాల్ జీ టాండన్‌కు మద్దతుగా లేఖ రాశారు. ఫిబ్రవరి 6, 2009లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకే గుండెపోటు, ఆపై పక్షవాతం వచ్చాయి. అల్జీమర్స్, మధుమేహంతోనూ వాజ్‌పేయి బాధపడుతున్నారు. కాగా, మరికొద్ది సేపట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చి వాజ్‌పేయిని పరామర్శించనున్నారు.

More Telugu News