ఆయుష్మాన్ భారత్... ఆరోగ్య బీమా పథకానికి అర్హతలివి!

16-08-2018 Thu 08:28
  • వచ్చే నెల నుంచి అమలులోకి ఆరోగ్య బీమా పథకం
  • సుమారు 50 కోట్ల మందికి లబ్ధి 
  • నిరుపేదలు, అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు లాభం
ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను దగ్గర చేసేలా 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమారు 50 కోట్ల మందికి ఈ పథకం లబ్ధిని చేకూర్చనుంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పుతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు, మహిళ కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, రోజువారీ కూలీపై ఆధారపడిన భూమి లేని కుటుంబాలు కూడా అర్హతను పొందుతాయి. అనాథలు, యాచకులు పారిశుద్ధ్య పని చేసే కుటుంబాలు, ఆదిమ గిరిజన వర్గాలు, వెట్టి చాకిరీ నుంచి చట్టబద్ధంగా విముక్తులైన వారు కూడా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు.

ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే, యాచకులు, చెత్త ఏరుకుని పొట్ట పోసుకునేవారు, ఇళ్లలో పాచి పని చేసుకునే వాళ్లు, వీధుల్లో తిరిగి వస్తువులు అమ్మేవారు, చర్మకారులు, నిర్మాణ కార్మికులు, ప్లంబర్‌, మేస్త్రి, పెయింటర్‌, వెల్డర్‌, సెక్యూరిటీ గార్డు, కూలీ, బరువులు మోసే కార్మికులు, తోటమాలి, చేతివృత్తి కార్మికులు, టైలర్లతో పాటు ఇంటి వద్ద ఉండి పని చేసుకునేవారు కూడా అర్హులే. వీరితో పాటు రవాణా కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, వారి సహాయకులు, తోపుడు బండి, రిక్షా కార్మికులు, దుకాణాల్లో సహాయకులుగా పనిచేసేవారు, చిన్న కంపెనీలో ప్యూన్లు, అంటెండెంట్లు, వెయిటర్లు, రజకులు తదితరులు అర్హులే.