Srisailam: శ్రీశైలానికి భారీ వరద... కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు!

  • 2 లక్షల క్యూసెక్కులకు పెరిగిన తుంగభద్ర వరద
  • నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు
  • నాగార్జున సాగర్ కు 70 వేల క్యూసెక్కుల నీరు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు పెరగడం, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నమోదైంది. ఈ వరద కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. ఆల్మట్టి జలాశయానికి 1.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, ఈ వరద గురువారం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఈ నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సైతం చెప్పుకోతగ్గ నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 157 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండాలంటే, మరో 58 టీఎంసీల నీరు అవసరం. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్ కు 69,913 క్యూసెక్కుల నీటిని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరో 4 వేల క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు.

More Telugu News