Ajit Wadekar: ప్రముఖ క్రికెటర్, భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ అజిత్ వాడేకర్ మృతి!

  • దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాడేకర్
  • తాజా, మాజీ క్రికెటర్ల సంతాపం
  • ఎనిమిదేళ్ల కెరీర్‌లో 37 టెస్టులాడిన అజిత్

టీమిండియా సీనియర్ క్రికెటర్, టెస్టు జట్టు మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ అజిత్ వాడేకర్ (77) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. క్రీడా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పౌర పురస్కారం ఇచ్చి గౌరవించింది. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.

అజిత్ వాడేకర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. 1971లో విదేశీ గడ్డపై వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్‌ను గెలవడం ద్వారా వాడేకర్ పేరు మార్మోగింది. తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో 37 టెస్టులు ఆడిన వాడేకర్ 14 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీతో 2113 పరుగులు చేశారు. టీమిండియా తొలి వన్డే కెప్టెన్‌గానూ వాడేకర్ రికార్డులకెక్కారు. అయితే, కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడారు. రిటైరైన తర్వాత అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత జట్టుకు మేనేజర్‌గా వాడేకర్ సేవలందించారు.

More Telugu News