Kerala: కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

  • భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం
  • రానున్న కొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • సీఎం పినరయి విజయన్ కు మోదీ, రాజ్ నాథ్ ఫోన్లు

కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రానున్న కొన్ని గంటల్లో కేరళలోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.

సీఎం పినరయి విజయన్ కు ప్రధాని, హోం మంత్రి ఫోన్

కేరళలో పరిస్థితిపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఆరా తీశారు. సీఎం పినరయి విజయన్ కు మోదీ, రాజ్ నాథ్ సింగ్ లు ఫోన్ చేసి మాట్లాడారు.  

‘ఓనమ్’ అధికారిక కార్యక్రమాల నిలిపివేత

కేరళ రాష్ట్ర పండగ ‘ఓనమ్’ అధికారిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బును వరద సహాయక కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు కేరళ ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రైళ్లు, బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కొచ్చి ఎయిర్ పోర్ట్ ను నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

పంబానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. పలు డ్యామ్ ల గేట్లు ఎత్తి వేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కేరళలో మృతుల సంఖ్య 67కు చేరింది. కేరళలో సహాయకచర్యలు చేపట్టడానికి, బాధితులకు పునరావసం కల్పించడానికి తక్షణ సాయం కింద రూ.400 కోట్లు అదనంగా మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సీఎం పినరయి విజయ్ ను కోరారు.

More Telugu News