kcr: రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్

  • రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ను అందిస్తున్నాం
  • ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది

రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మల్కాపూర్ నుంచి ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.  మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ లో ‘కంటి వెలుగు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ను ప్రజలకు అందిస్తున్నామని, ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఇప్పటికే, 40 లక్షల కంటి అద్దాలు తెప్పించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి జబ్బుల బారిన పడుతున్నవాళ్ల సంఖ్య బాగానే ఉందని, వృద్ధులు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ పథకం అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

కంటి వైద్య పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 825 బృందాలను నియమించామని, 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని చెప్పారు. కంటి వైద్యం కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రతి గ్రామంలో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ‘కాటరాక్ట్ ఆపరేషన్ అంటే నేను కూడా మొదట్లో భయపడేవాడిని, నా రెండు కళ్లకు ఈ ఆపరేషన్ చేయించుకున్నా’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

More Telugu News