murugan: ఈ తాత మామూలోడు కాదు.. పెళ్లి పేరుతో 30 మంది మహిళలకు కుచ్చుటోపి!

  • మోసాలకు అలవాటుపడ్డ మురుగన్
  • పెళ్లి పేరుతో మహిళల నుంచి బంగారం, నగదు స్వాధీనం
  • అనంతరం సిమ్ కార్డు పారేసి పరారీ

ఆయనో పెద్ద మనిషి. అయితేనేం పెళ్లి పేరుతో తమిళ దిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. తాను ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ నడుపుతున్నాననీ, మొదటి భార్యకు విడాకులిచ్చానని చెప్పేవాడు. ఈ ప్రకటనకు ఆసక్తి చూపారో అంతే సంగతులు. మాయమాటలు చెప్పి వారి నుంచి నగదు, నగలు తీసుకుని ఊడాయించేవాడు. చివరికి పాపం పండటంతో ఈ మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

తమిళనాడులోని పోరూరుకు చెందిన మురుగన్(59) కేవలం ఇంటర్ వరకే చదువుకున్నాడు. గతంలో కంపెనీలకు సెక్యూరిటీ గార్డులను అందించేందుకు ఓ సంస్థను స్థాపించాడు. చివరికి సక్సెస్ కాకపోవడంతో దాన్ని మూసేశాడు. అనంతరం 2008లో తప్పుడు ప్రొఫైల్ తో న్యూస్ పేపర్లలో పెళ్లి ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తానో బిజినెస్ మ్యాన్ అని, తనకు ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం ఉందని చెప్పేవాడు. తనకు కులమతాల పట్టింపు లేదని కలరింగ్ ఇచ్చేవాడు. మొదటి భార్యతో తాను విడిపోవాల్సి వచ్చిందని అనేవాడు. దీంతో పలువురు మహిళలు మురుగన్ ను సంప్రదించారు. వీరిలో చాలామంది వితంతువులు ఉన్నారు.

వీరిని కలుసుకునే సమయంలోనూ మురుగన్ తెలివిగా వ్యవహరించేవాడు. సీసీటీవీ కెమెరాలు లేనిచోటే వీరితో మీటింగ్ పెట్టేవాడు. చివరికి తనపై ఎదుటివారికి నమ్మకం కుదిరాక ప్లాన్ ను అమలుచేసేవాడు. ఆభరణాలు, నగదు జాగ్రత్తగా దాచిపెడతానని ఓసారి, వ్యాపారంలో అర్జంట్ గా కావాలని మరోసారి వారి నుంచి నగలు, డబ్బులను గుంజేవాడు. ఓసారి చేతిలో క్యాష్ పడిందా.. ఇక ఫోన్ ను స్వీచ్ఛాఫ్ చేసేసేవాడు. సిమ్ ను తీసిపారేసేవాడు. ఇలా దాదాపు 30 మంది మహిళలను మురుగన్ ముంచేశాడు. దీంతో నష్టపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు సిమ్ నంబర్లతో విచారణ ప్రారంభించగా.. ఈ ప్రబుద్ధుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సిమ్ కార్డులు మార్చాడని తేలింది. ఎన్ని సిమ్ కార్డులు మార్చినా అప్పటి నుంచి ఒకే ఫోన్ ను వాడుతుండటంతో తాంబరం పోలీసులు మురుగన్ ను వలపన్ని పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 18 తులాల బంగారం, రూ.30,000 క్యాష్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుడి ఇంట్లో గుట్టగా పడిఉన్న 50 సిమ్ కార్డులు కూడా పోలీసులకు దొరికాయి. చివరికి నిందితుడిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. పోలీసుల విచారణలో మురుగన్ కు స్వగ్రామం పోరూరులో భార్య, పిల్లాడు ఉన్నట్లు తేలింది.

More Telugu News