mamata banerjee: మహాత్మాగాంధీది కూడా ఈ దేశం కాదంటారేమో: అమిత్ షాపై మమత ఫైర్

  • ఎన్ఆర్సీ గుర్తించిన వారిలో 38 లక్షల మంది బంగ్లా మాట్లాడే హిందువులు, ముస్లింలే
  • జమిలి ఎన్నికలను మేము వ్యతిరేకిస్తున్నాం
  • కేంద్ర ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రాలు కూడా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. మీ తల్లిదండ్రుల జన్మ ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు మీరు చూపించగలరా? అంటూ అమిత్ షాను ఆమె ప్రశ్నించారు. మహాత్మాగాంధీ కుటుంబీకులు కూడా జన్మ ధ్రువీకరణ పత్రాలను చూపించకుంటే... గాంధీది కూడా ఈ దేశం కాదంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. కొన్ని రోజులు గడిస్తే పశువులకు కూడా బర్త్ సర్టిఫికెట్లు కావాలంటారేమోనని విమర్శించారు. అసోంలో దాదపు 40 లక్షల మందిని అక్రమ వలసదారులుగా ఎన్ఆర్సీ నివేదిక పేర్కొంటోందని... వీరిలో దాదాపు 38 లక్షల మంది బంగ్లా మాట్లాడే హిందువులు, ముస్లింలు ఉన్నారని ఆమె అన్నారు. వీరందరినీ దేశం నుంచి ఎలా తరిమేస్తారని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ ఈ కుట్రలకు పూనుకుందని మండిపడ్డారు.

జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యంకాదని మమత అన్నారు. ఇలాంటి పద్ధతి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే సరిపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించిన పక్షంలో... ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పడిపోతే, అప్పుడు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రం, రాష్ట్రాలు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అని అడిగారు. ఇలాంటి కారణాల వల్లే తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 

More Telugu News