cbn: 2029 కల్లా దేశంలోని ఏపీని అగ్ర రాష్ట్రంగా నిలబెడతాం: ఏపీ సీఎం చంద్రబాబు

  • శ్రీకాకుళం ఎందరో గొప్ప నేతలకు నిలయం
  • రైతులకు రూ.24,500 కోట్ల రుణాలను మాఫీ చేశాం
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలబెడతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ.. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎందరో గొప్ప నేతలకు నిలయమని వ్యాఖ్యానించారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతిఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుతున్నామని చంద్రబాబు అన్నారు. తొలి నాలుగేళ్లు వరుసగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో నిర్వహించామని గుర్తుచేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందువల్లే గత నాలుగేళ్లలో రెండంకెల వృద్ధి రేటును సాధించగలిగామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు సంబంధించి రూ.24,500 కోట్ల రుణాలను మాఫీ చేశామని పేర్కొన్నారు. ఆనంద ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News