పాస్‌పోర్టు జారీలో చిక్కు ప్రశ్నలకు స్వస్తి.. దరఖాస్తు ఇక మరింత సులభం!

15-08-2018 Wed 07:30
  • ఏడాది చిరునామా నిబంధన తొలగింపు
  • ఇద్దరు పరిచయస్తుల పేర్లూ అవసరం లేదు
  • వెల్లడించిన విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి

పాస్‌పోర్టు జారీని మరింత సరళతరం, సులభతరం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టు జారీ సమయంలో పోలీసు విచారణ పేరుతో కాలయాపన కాకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ప్రస్తుత నిబంధన ప్రకారం  పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం ఏడాదిపాటు ఉన్న నివాస చిరునామానే పేర్కొనాల్సి వచ్చేది. పోలీసులు కూడా దీనిని పక్కాగా  చూసేవారు. అలాగే, వారు అక్కడ ఉంటున్నదీ, లేనిదీ నిర్ధారించుకునేందుకు ఆ ప్రాంతంలోని ఇద్దరి వ్యక్తుల పేర్లను విచారణకు వచ్చిన పోలీసులకు ఇవ్వాల్సి వచ్చేది. వారి ఆధార్ వివరాలతోపాటు అడ్రస్‌ను కూడా తీసుకునేవారు.

ఇప్పుడీ నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇకపై ఈ నిబంధన ఉండదని, దరఖాస్తులో ఎవరి పేర్లను రాయాల్సిన అవసరం లేదని విశాఖపట్టణం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్ఎల్‌పీ చౌదరి తెలిపారు. అలాగే, దరఖాస్తుదారుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటూ విచారణకు పంపే పోలీసులకు గతంలో తొమ్మిది ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు వీటిని కుదించి ఆరు ప్రశ్నలకు తగ్గించారు. ఫలితంగా పాస్ట్‌పోర్టు దరఖాస్తు మరింత సులభతరం కావడంతో పాటు జారీ ప్రక్రియలో కూడా వేగం పెరగనుంది.

తనిఖీలో భాగంగా దరఖాస్తుదారుతో గానీ, వారి తల్లిదండ్రులతో గానీ పోలీసులు మాట్లాడాల్సిన పనిలేదు. అసలు వారి ఇంటికీ వెళ్లనవసరంలేదు. మొత్తం మీద దరఖాస్తుదారుపై పోలీసు కేసులేమైనా వున్నాయా? లేవా? ఇండియన్ అవునా? కాదా? అనే  విషయాలను పోలీసులు ధృవీకరిస్తే సరిపోతుందని విదేశాంగ శాఖ స్పష్టంగా పేర్కొంది.