Pawan Kalyan: మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాలి: పవన్ కల్యాణ్

  • దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • మహనీయుల స్ఫూర్తిని మనం నరనరాన నింపుకోవాలి
  • అభివృద్ధి ఫ‌లాలు అతి కొద్ది మందికే అందుతున్నాయి

రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయులు, వీరుల త్యాగాల ఫలం. సమరయోధుల పోరాట పటిమతో మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించాయి. జీవితాలను తృణప్రాయంగా భావించి తెల్లవారిపై పోరుసల్పిన ఎందరో విప్లవ వీరుల ప్రాణ త్యాగాలు మన స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని ప్రతి అధ్యాయంలో కనిపిస్తాయి. మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉంది.

శాసనకర్తల స్థానాల్లో ఉన్నవారు - కొద్దిమంది క్షేమం కోసం కాకుండా, సువిశాల భారతాన్ని మదిలో ఉంచుకొని కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. అందుకు భిన్నంగా వర్తమానం ఉంది. ఏడు దశాబ్దాలు పైబడిన మన స్వతంత్ర భారతంలో అభివృద్ధి ఫ‌లాలు అతి కొద్ది మందికే అందుతున్నాయి. ఆర్థికంగా బ‌ల‌మైన వారు మ‌రింత బలపడుతుంటే... పేదవారు మరింత పేదలుగా మారడాన్ని అభివృద్ధి అనగలమా? కుల‌, మ‌త‌, ప్రాంత వివ‌క్ష‌ల‌తో కునారిల్లే పరిస్థితులు సమాజానికి శ్రేయస్కరం కాదు.

గాంధీజీ, భగత్ సింగ్, ఆజాద్, అంబేద్కర్, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు అందించిన స్ఫూర్తిని మనందరం నరనరాన నింపుకోవాలి. పాలకుల కుటుంబాలు మాత్రమే వెలుగొందితే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ‘మా కుటుంబం, మావాళ్లు’ అనే కుత్సిత ధోరణితో పాలన చేసే వారి నుంచి మనం విముక్తం కావాలి. అప్పుడే అట్టడుగు స్థాయి వరకూ సంక్షేమ ఫలాలు అందించగలం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇది మనందరి ఆకాంక్ష కావాలి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా తరఫున, జనసేన పార్టీ తరఫున దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పవన్ పేర్కొన్నారు.

More Telugu News