Rahul Gandhi: తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రీ డిజైన్ లు చేసి డబ్బు దండుకుంటున్నారు: రాహుల్ గాంధీ

  • తెలంగాణ ఏర్పాటయ్యాక కన్నకలలు సాకారం కావట్లేదు
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదు
  • ఇది వరకు ‘కుంభకోణం’.. ఇప్పుడు ‘రీ డిజైన్’ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  ప్రజలు కన్న కలలు సాకారం కాలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ‘విద్యార్థి, నిరుద్యోగ గర్జన’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ, తెలంగాణ ఫలాలు అందరికీ అందడం లేదని, ఎన్నికల తర్వాత రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చారని, ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారి కోసం పలు వాగ్దానాలు చేశారు, కానీ, ఆ వాగ్దానాలను అమలు చేయలేదని విమర్శించారు.

 నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఈ నాలుగేళ్లలో పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సీఎం మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాఫెల్ విమానాల ధర చెప్పమంటే ఫ్రాన్స్ తో రహస్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి చెబుతున్నారని అన్నారు. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఈ రహస్య ఒప్పందం గురించి అడిగానని, రహస్య ఒప్పందమేమీ లేదని ఆయన చెప్పారని అన్నారు. తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసినప్పుడు తనతో పాటు ఆనంద్ శర్మ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారని చెప్పారు. రాఫెల్ కాంట్రాక్టును రీ డిజైన్ చేసి విమానాల తయారీలో అనుభవం లేని అనిల్ అంబానికీ కట్టబెట్టి వేల కోట్ల రూపాయల నజరానా ఇచ్చారని,  ఇది వరకు ఇలాంటి అంశాలను ‘కుంభకోణం’ అనే వాళ్లమని, ఇప్పుడు ‘రీ డిజైన్’ అంటున్నారని రాహుల్ అభివర్ణించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రీ డిజైన్ లు చేసి డబ్బు దండుకుంటున్నారని, అంబేద్కర్ పేరున ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల పేరును కాళేశ్వరంగా మార్చి గారడీ చేశారని రాహుల్ ఆరోపించారు. రీడిజైన్ వల్ల రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు రూ.లక్ష కోట్లకు చేరిందని, టెండర్లు లేకుండా ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో మోదీ రీడిజైన్ చేశారని, తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News