అభిమానులకు భావోద్వేగ మెసేజ్ ను పంపిన కోహ్లీ

14-08-2018 Tue 14:27
  • కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు నేర్చుకుంటాం
  • గెలవాలనే పట్టుదలతోనే మేము ఆడతాం
  • మిమ్మల్ని అలరించడానికి వంద శాతం ప్రయత్నిస్తాం

ఇంగ్లండ్ పై వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో, టీమిండియా ఆటగాళ్లపై భారత అభిమానులు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా ఆడిన తీరును తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఓ భావోద్వేగ మెసేజ్ ను పంపాడు. 'కొన్ని సార్లు గెలుస్తాం. కొన్నిసార్లు నేర్చుకుంటాం. మేము ఎప్పుడూ గెలవాలనే ఆడుతాం. కొన్ని సందర్భాల్లో విజయాన్ని సాధించలేక పోవచ్చు. ప్రస్తుత పరాజయాల పట్ల మేము కూడా బాధపడుతున్నాం. మాపై నమ్మకం ఉంచండి. మాకు అండగా నిలవండి. మిమ్మల్ని అలరించడానికి వంద శాతం ప్రయత్నిస్తాం. ఆటలో ఎత్తుపల్లాలు సహజమే' అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

లార్డ్స్ టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, తాము చేసిన తప్పిదాలను అంగీకరిస్తున్నామని, మూడో టెస్టులో అవి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపాడు. మూడో టెస్టులో గెలవడంపైనే తమ దృష్టి ఉందని చెప్పాడు. టెస్టులో 20 వికెట్లను పడగొట్టగలిగే బౌలింగ్ సత్తా మనకుందని, కానీ బ్యాటింగ్ విభాగమే ఆందోళనకు గురి చేస్తోందని అన్నాడు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తే, బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.