Tamilnadu: ఉగ్రవాదులతో లింక్ ఉన్నవారే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!: ప్రధాని మోదీ సంచలన ఆరోపణ

  • పక్కా ఆధారాలు ఉన్నాయన్న ప్రధాని
  • ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్ళ
  • తమిళనాడులో ప్రత్యామ్నాయంగా మారతామని స్పష్టీకరణ

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ, తమిళనాడులోని కూడంకుళంలో నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి కొన్ని స్వచ్చంద సంస్థలు సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులే దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తమిళ పత్రిక ‘డైలీ తంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై స్పందించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులే మౌలిక ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మోదీ స్పష్టం చేశారు. ఇందుకు తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ శక్తులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.

2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే, అన్నాడీఎంకే మద్దతు లేకుండానే తమిళనాడులో బీజేపీ ఓ లోక్ సభ స్థానాన్ని దక్కించుకుందని మోదీ అన్నారు. బీజేపీకి తమిళనాడులో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News