Tirumala: తిరుమలలో నేడు కీలక ఘట్టం... మూలవిరాట్ పద్మ, పాద పీఠాలకు బంధనం!

  • తిరుమలలో ఎనిమిది ద్రవ్యాలతో తయారైన అష్టబంధనం
  • నేడు దాన్ని దారంలా పెనవేసి మెత్తించనున్న అర్చకులు
  • ఎల్లుండితో ముగియనున్న మహా సంప్రోక్షణం

తిరుమలలో జరుగుతున్న అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణంలో భాగంగా నేడు కీలకఘట్టం జరగనుంది. ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి, పాకంగా తయారు చేసిన అష్టబంధనాన్ని నేడు స్వామివారి పద్మపీఠానికి, పాద పీఠానికీ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సమక్షంలో సమర్పించనున్నారు.

5 తులాల చొప్పున తీసుకున్న ఎనిమిది ద్రవ్యాలనూ రోటిలో వేసి గంటసేపు దంచగా, తయారైన పాకాన్ని ఓ పాత్రలోకి తీసుకుని దాన్ని దారంలా పెనవేసి, పాద, పద్మ పీఠాల మధ్యలో మెత్తిస్తారు. ఇలా చేయడం వల్ల మరో 12 సంవత్సరాల పాటు స్వామివారి విగ్రహం అణువంతైనా కదలకుండా నిలిచివుంటుంది. అలాగే అష్ట దిక్కుల్లో, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లోనూ అష్టబంధనం చేయనున్నారు.

కాగా, నిన్న సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై రాత్రి 7 నుంచి 10 గంటల వరకూ యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఆనంద నిలయంపై మొలిచిన చిన్నపాటి రావి మొక్కలను తొలగించారు. రేపు, ఎల్లుండి జరిగే కార్యక్రమాల్లో భాగంగా, ప్రధానార్చకులతో పాటు పలువురు రుత్విక్కులు ఆనంద నిలయంపైకి చేరుకోవాల్సి వుండటంతో ఇంజనీరింగ్ సిబ్బంది పటిష్ఠ నిచ్చెనను ఏర్పాటు చేశారు. నేడు సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

More Telugu News