alagiri: కరుణానిధి కుటుంబంలో మళ్లీ ప్రారంభమైన లొల్లి!

  • స్టాలిన్ నాయకత్వానికి సవాల్ విసిరిన అళగిరి
  • కరుణానిధి ఆప్తులు, కేడర్ అంతా తన వెనకే ఉన్నారంటూ వ్యాఖ్య
  • డీఎంకేలో కలకలం రేపుతున్న అళగిరి వ్యాఖ్యలు

కరుణానిధి మరణించి వారం కూడా కాకుండానే ఆయన కుటుంబంలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్న వేళ... కరుణ మరో కుమారుడు అళగిరి తెరపైకి వచ్చారు. కరుణ స్మారక ప్రాంతం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టాలిన్ నాయకత్వానికి సవాల్ విసిరారు. డీఎంకే కేడర్ మొత్తం తన వెనకే ఉందని, నిజమైన డీఎంకే నేతలంతా తనవైపే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయని, కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.

తన తండ్రి ఆప్తులంతా తనవైపే ఉన్నారని, రాష్ట్రంలోని పార్టీ మద్దతుదారులంతా తననే కోరుకుంటున్నారని అళగిరి చెప్పారు. ప్రస్తుతానికి తాను ఇంతవరకు మాత్రమే చెప్పగలనని అన్నారు. అళగిరి వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానున్న ఒక్క రోజు ముందు అళగిరి ఈ వ్యాఖ్యలు చేయడం, డీఎంకేలో కలకలం రేపుతున్నాయి.

కరుణానిధికి నివాళి అర్పించడమే రేపటీ డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అజెండా అయినప్పటికీ... స్టాలిన్ ను పార్టీ అధినేతగా ప్రకటించే జనరల్ కౌన్సిల్ సమావేశం తేదీని రేపటి సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. 1969లో అన్నాదురై చనిపోయినప్పుడు కూడా... ఇదే మాదిరి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. రేపటి సమావేశం ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. కమిటీలో ఉన్న సభ్యులందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

పార్టీలో స్టాలిన్ కు తన తండ్రి కరుణ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, అళగిరి అప్పట్లోనే రెబెల్ గా మారారు. దీంతో, ఆయనను పార్టీ నుంచి కరుణ బహిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. తదనంతరం కరుణ బతికున్నంత కాలం అళగిరి ఎలాంటి రాద్ధాంతం చేయకుండా, మౌనంగానే ఉండిపోయారు. తన తండ్రి మరణించిన అనంతరం, ఇప్పుడు మళ్లీ గళమెత్తారు.

More Telugu News