jagan: జగన్ వద్ద పీకే సర్వే.. నేతల్లో గుబులు!

  • సైలెంట్ గా సర్వే పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్
  • సర్వే ఆధారంగా ఇప్పటికే పలువురు నేతలకు పరోక్ష సంకేతాలు పంపిన జగన్
  • టికెట్ గురించి ఆందోళన చెందుతున్న పలువురు వైసీపీ నేతలు

నియోజకవర్గాల్లో వివిధ పార్టీల బలాలు, గెలుపు గుర్రాలు ఎవరు? ఏ నాయకుడికి, ఏ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? తదితర వివరాలలో కూడిన సర్వేను వైసీపీ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ టీమ్ పూర్తి చేసిందని సమాచారం. ఈ నివేదిక ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కు చేరిందని తెలుస్తోంది. పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం సమాచారం లేకుండానే ఈ సర్వేను పీకే టీమ్ పూర్తి చేసింది. వివిధ వర్గాల ప్రజలతో వారు మమేకమై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు సమాచారం.

సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోనే జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని జగన్ మొదట్లో భావించారు. అయితే, వివిధ కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే నేతలతో జగన్ వరుస భేటీలు ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు పీకే టీమ్ సర్వే జరిపిన విషయం వాస్తవమేనని, అయితే సర్వేలో ఏయే నాయకుడిపై ఎలాంటి రిపోర్ట్ ఉందో మాత్రం తనకు తెలియదని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ సర్వే గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని పలువురు నేతలు టెన్షన్ కు గురవుతున్నారట. 

More Telugu News