Srisailam: ఈ సీజన్ లో తొలిసారి... శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కదిలిన కృష్ణమ్మ!

  • శ్రీశైలంకు 95 వేల క్యూసెక్కుల నీరు
  • దిగువకు 33 వేల క్యూసెక్కులు
  • సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
  • నిండుకుండల్లా తెలంగాణ జలాశయాలు

ఈ సీజన్ లో తొలిసారిగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు ప్రారంభమయ్యాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు వస్తున్న నీటిని వస్తున్నట్టు విడుదల చేస్తుండగా, శ్రీశైలంకు ఈ ఉదయం 95,264 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరద మరింతగా పెరిగే అవకాశాలు ఉండటంతో, కుడి, ఎడమ కాలువలతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

 దీంతో నాగార్జున సాగర్ కు సుమారు 25 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో కుడి కాలువకు నీటిని విడుదల చేయగా, రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. కుడి కాలువకు గత రాత్రి నీటి విడుదలను ప్రారంభించగా, బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి కారంపూడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు ప్రకాశం జిల్లా వైపు పరుగులు పెడుతోంది.

కాగా, మరోవైపు తెలంగాణలోని చిన్న, మధ్య తరహా జలాశయాల్లోకి భారీ వరద వచ్చి చేరడంతో, అన్నీ నిండుకుండల్లా మారాయి. కిన్నెరసాని, కొమురం భీమ్, తాలిపేరు, కడెం ప్రాజెక్టుల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తి వేశారు. ఎల్లంపల్లి నుంచి దిగువకు 2.89 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కడెం నుంచి 61 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది. గుమ్మడివల్లి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

More Telugu News