Kerala: వరద బీభత్సంతో రూ. 8,316 కోట్ల నష్టం: పినరయి విజయన్

  • కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
  • వెంటనే రూ. 1,220 కోట్లు విడుదల చేయండి
  • రాజ్ నాథ్ తో కలసి ఏరియల్ సర్వే అనంతరం కేరళ సీఎం

గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం కాగా, మొత్తం రూ. 8,316 కోట్ల నష్టం వాటిల్లిందని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలసి ఏరియల్ సర్వే చేసిన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, వెంటనే కేంద్రం నుంచి రూ. 1,220 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు. ఆపై కేంద్రం నుంచి రూ. 400 కోట్ల ప్రత్యేక సాయం కావాలని, ఇప్పటికే తాము కోరిన రూ. 820 కోట్లకు అదనంగా ఈ మొత్తాన్ని శాంక్షన్ చేయాలని ఆయన కోరారు.

అవసరమని భావిస్తే, కేంద్రం నుంచి మరో బృందం వచ్చి, ఎంత నష్టం జరిగిందన్న విషయాన్ని సమీక్షించవచ్చని అన్నారు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వారి పునరావాస చర్యలు తక్షణమే చేపట్టాల్సి వుందని విజయన్ వ్యాఖ్యానించారు. దాదాపు 20 వేల ఇళ్లు వరదల కారణంగా దెబ్బతిన్నాయని, 10 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు పాడైపోయాయని ఆయన తెలిపారు. స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ చూడనంత వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయని, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో అత్యధిక నష్టం సంభవించిందని ఆయన తెలిపారు.

More Telugu News