Team India: రెండో టెస్టులో చిత్తుగా, చెత్తగా ఓడిన టీమిండియా.. సిరీస్‌లో వరుసగా రెండో ఓటమి!

  • అండర్సన్ బౌలింగ్ ముందు నిలవలేకపోయిన భారత బ్యాట్స్‌మెన్
  • పెవిలియన్‌కు క్యూ
  • ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఘోర ఓటమి

టీమిండియా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమిండియా.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో మరింత ఘోరంగా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు.

వర్షం కారణంగా రెండో టెస్టు తొలి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ వాయిదా పడగా, రెండో రోజూ వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించాడు. అనంతరం ఆట ప్రారంభం కాగా 107 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 396 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్ చేసింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే ఖాతా కూడా తెరవకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ సమర్పించుకున్న జేమ్స్ అండర్సన్‌కే రెండో ఇన్నింగ్స్‌లోనూ వికెట్ సమర్పించుకున్నాడు.  

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ ను దెబ్బతీసిన జేమ్స్ అండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ను శాసించాడు. నాలుగు వికెట్లు తీసి టీమిండియా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అతడి దెబ్బకు భారత్ 130 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన 33 పరుగులే అత్యధికం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లోనూ అశ్వినే (29) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. కాగా, భారత్‌ను 130 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ సెంచరీ హీరో క్రిస్ వోక్స్ (137)కి  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

More Telugu News