Pawan Kalyan: బైబిల్ లోని ఆ వాక్యాలను తు.చ.తప్పకుండా పాటిస్తా!: పవన్ కల్యాణ్

  • ‘తనను తాను తగ్గించుకున్నవాడు..హెచ్చింపబడును’
  • దీనిని బైబిల్ నుంచి చిన్నప్పుడు నేర్చుకున్నా
  • ‘జైహింద్’ అనడం నాకు నేర్పింది ఓ క్రిస్టియన్ టీచర్

‘తనను తాను తగ్గించుకున్నవాడు.. హెచ్చింపబడును’ అని బైబిల్ నుంచి తాను చిన్నప్పుడు నేర్చుకున్నానని, ఆ వాక్యాలను తాను తు.చ తప్పకుండా పాటిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రూపాంతర దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏసు ప్రభువును మనస్ఫూర్తిగా తాను ఆరాధిస్తానని, తాను సర్వమతాలు సమానమని నమ్ముతానని చెప్పారు. ‘నేను ప్రతిసారి ‘జైహింద్’ అని అంటాను. అలా అనడం నాకు నేర్పించింది ఒక క్రిస్టియన్ టీచర్. ఆమెను నేను ‘అమ్మ’ అని అంటాను. ఆమె ఇప్పుడు లేరు. నాకు పాఠాలతో పాటు దేశభక్తిని నేర్పించిన మహాత్మురాలు. జీసస్ క్రైస్ట్ తాలూకు గొప్పతనం, ఆయన సహనం, క్షమాగుణం.. గురించి ఆ తల్లి నాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది. సర్వమతాలను, సర్వ మత గ్రంథాలను మనస్ఫూర్తిగా గౌరవించే సంస్కారం ఉన్న కుటుంబం మాది. అందుకే, ప్రతిఒక్కరి సమస్యలను, బాధలను నేను అర్థం చేసుకోగలను.. ఏ మహాత్ముడు బోధించినా మానవత్వం గురించే. ఆ మానవత్వానికి పరాకాష్ట అయిన జీసెస్ క్రైస్ట్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని కోరారు.

More Telugu News