Madhya Pradesh: ఫ్రెండ్ షిప్ రోజున స్నేహితులకు రూ.46 లక్షలు వెదజల్లిన రియల్టర్ కొడుకు!: పోలీసులను ఆశ్రయించిన తండ్రి

  • మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘటన
  • కారు, స్మార్ట్ ఫోన్లు కొనుక్కున్న స్నేహితులు
  • నగదు వెనక్కి ఇచ్చేయాలని పోలీసుల ఆదేశం

ఫ్రెండ్ షిప్ డే రోజున స్నేహితులు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంకొంచెం స్తోమత ఉంటే హోటల్, రిసార్టులకు వెళ్లి పార్టీలు చేసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు మాత్రం తన స్నేహితులకు రూ.46 లక్షలు పంచిపెట్టాడు. అంత నగదు మాయం కావడంతో నెత్తీనోరు బాదుకున్న సదరు రియల్టర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జబల్ పూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ ఆస్తి అమ్మగా వచ్చిన రూ.60  లక్షలను ఇంట్లోని అల్మారాలో ఉంచాడు. దానిలోని రూ.45 లక్షలను తీసుకున్న కుమారుడు.. స్కూలుకు తీసుకెళ్లాడు. ఓ పేదింటి అబ్బాయికి రూ.15 లక్షలు ఇచ్చాడు. తన హోంవర్క్ చేసినందుకు మరో విద్యార్థికి రూ.3 లక్షల నజరానా అందించాడు. ఇలా క్లాస్ లోని 35 మందికి తలా కొంచెం పంచేశాడు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. వీరిలో ఒకరు ఆ డబ్బుతో కారు కొనుక్కోగా, మరికొందరు స్మార్ట్ ఫోన్లు, వెండి బ్రేస్ లెట్లు కొనుక్కున్నారు.

ఈలోగా అల్మారాలో పెట్టిన నగదు కనిపించకపోవడంతో సదరు రియల్టర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకూ రూ.15 లక్షలు రికవరీ చేయగలిగారు. అయితే రూ.15 లక్షలు అందుకున్న విద్యార్థి కుటుంబం జాడ ప్రస్తుతం తెలియడం లేదు. తీసుకున్న నగదును ఐదు రోజుల్లోగా వెనక్కి ఇవ్వాలని విద్యార్థుల కుటుంబాలను ఆదేశించామని పోలీసులు తెలిపారు.

More Telugu News