Tollywood: తప్పనిసరై అప్పట్లో అలాంటి పాత్రల్లో చేశాను: నటి పవిత్రా లోకేశ్

  • కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు
  • ఇల్లు గడవడం కోసం నెగటివ్ రోల్స్ కూడా
  • 'ప్రస్థానం' తరువాత వెనుదిరిగి చూడలేదన్న పవిత్రా లోకేశ్

పుట్టి, పెరిగింది కన్నడ సీమలోనైనా, తల్లి క్యారెక్టర్లలో రాణిస్తూ, తెలుగులో టాప్ హీరోలందరితో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న పవిత్రా లోకేష్, తన సినీ రంగ ప్రవేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన తండ్రి మైసూర్ లోకేశ్ 400 సినిమాల్లో నటించారని, తాను పదో తరగతిలో ఉన్న సమయంలో ఆయన మరణించగా, చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. అమ్మ టీచర్ గా పనిచేస్తుంటే, తాను డేటా ఎంట్రీ వర్క్ చేస్తూ, కొన్ని బాధ్యతలను పంచుకుంటూ, రెగ్యులర్ డిగ్రీ, ఓపెన్ వర్శిటీలో పీజీ చేశానని చెప్పింది.

తన ఇంటికి స్టార్ హీరో అంబరీశ్ వచ్చినప్పుడు, తనను సినిమాల్లోకి ఆహ్వానించారని, 16 సంవత్సరాల వయసులోనే పరిశ్రమకు వచ్చానని, తన తండ్రికి మంచి పేరు ఉండటంతో గ్రాండ్ వెల్ కమ్ ఉంటుందని భావించిన తనకు, అలా ఆలోచించుకోవడం తప్పని తెలిసేందుకు ఎక్కువ కాలమేమీ పట్టలేదని చెప్పింది.

అయిష్టంగా సినిమాల్లోకి ప్రవేశించిన తనకు అక్కడి పరిస్థితులు అవగతమయ్యాయని, ఎవరూ మాట సాయం కూడా చేయలేదని చెప్పింది. శ్రీదేవిలా స్టార్ హీరోయిన్ అవాలని భావించిన తనకు, సెకండ్ హీరోయిన్ చాన్సులే వచ్చాయని పవిత్రా లోకేశ్ వ్యాఖ్యానించింది. ఎత్తుగా ఉండటం, లావుగా ఉండటం తనకు మైనస్ అయిందని, బతకడం, ఇల్లు గడవటం కోసం కొన్ని నెగటివ్ రోల్స్ చేయాల్సి వచ్చిందని, అప్పనిసరై అప్పట్లో కొన్ని పాత్రలను ఇష్టం లేకుండా చేశానని చెప్పింది.

కన్నడలో తన సినిమాలను చూసిన భీమనేని శ్రీనివాసరావు, తెలుగులో 'దొంగోడు'లో చాన్స్ ఇచ్చారని, ఆ తరువాత 'ప్రస్థానం'తో వెనక్కు తిరిగి చూడలేదని చెప్పింది. 'రేసుగుర్రం', 'టెంపర్', 'జై లవకుశ', 'పండగ చేస్కో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'ఎంసీఏ', 'అజ్ఞాతవాసి', 'సాక్ష్యం', 'హ్యాపీ వెడ్డింగ్' వంటి చిత్రాల్లో మంచి పాత్రలు వచ్చాయని, వయసుకు మించిన పాత్రలను చేస్తున్నందుకు తానేమీ బాధపడటం లేదని చెప్పింది.

More Telugu News