Vijayawada: విజయవాడలో గూడ్స్ బోగీలే 'పడక'గదులు!

  • కామవాంఛ తీర్చుకునేందుకు గూడ్స్ యార్డుకు
  • సమీపంలోనే ఓ బెల్టు షాపు కూడా
  • తాము అరెస్ట్ లు చేయలేమంటున్న పోలీసులు
  • మామూళ్లకు అలవాటుపడిన రైల్వే పోలీసులు

తమ శారీరక వాంఛలను తీర్చుకునేందుకు ఖాళీగా పడివున్న గూడ్స్ బోగీలను పడక గదులుగా మార్చుకుంటున్నారన్న ఫిర్యాదులు పెరుగుతూ ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సాధారణంగా విజయవాడకు వచ్చే గూడ్స్ బోగీలను కేఎల్ రావు నగర్ లోని గూడ్స్ యార్డుల్లో ఉంచుతారు. ఇక్కడికి వచ్చిన బోగీలు, ఒకసారి అన్ లోడ్ తరువాత, తిరిగి లోడ్ అయ్యేంత వరకూ నెలల తరబడి అక్కడే ఉండిపోతాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, స్థానిక పోలీసుల గస్తీ లేకపోవడం, రైల్వే పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో, బోగీలను తమ కామవాంఛను తీర్చుకునేందుకు పలువురు వాడుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇక్కడ కూలీలు విశ్రాంతి తీసుకునే షెడ్డు సమీపంలో ఓ బెల్టు షాపు కూడా వెలయడంతో, చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువకులు, ఈ షెడ్ ను తమ మందు పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నలుగురు యువకులు, ఓ మహిళను తీసుకుని వచ్చి బోగీలోకి వెళ్లగా, ఆపై చాలా సేపటి వరకూ ఆమె బయటకు రాకపోవడాన్ని గమనించిన చుట్టుపక్కల మహిళలు, అక్కడికి వచ్చి చూడగా, మద్యం మత్తులో ఆమె పడివుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, గూడ్స్ యార్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో ఉండటంతో, లా అండ్ ఆర్డర్ పోలీసులకు అక్కడికి వెళ్లేందుకు అధికారాలు లేవు. దీంతో కొత్తపేట పోలీసులు ఆ వైపు వెళ్లడం మానేయగా, ఆర్పీఎఫ్ సిబ్బంది చేతుల్లో ఎంతో కొంత పెట్టి మందుబాబులు, వ్యభిచారులు తప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై స్పందించిన విజయవాడ, కొత్తపేట పోలీసులు, కేఎల్ రావు నగర్ లో ఉన్న గూడ్స్ యార్డులో అసాంఘిక కార్యకలాపాలపై తమకు ఫిర్యాదులు వచ్చాయని అంగీకరించారు. విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని, వారే కేసులు నమోదు చేసి, అరెస్ట్ లు చేయాల్సివుందని అన్నారు.

More Telugu News