Rains: ఉగ్ర గోదావరి... ఒక్క రోజులో 11 అడుగులు పెరిగిన నీటిమట్టం!

  • పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
  • 33 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • సాయంత్రానికి 40 అడుగులకు చేరే అవకాశం

ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతూ, ఆ వరద నీరంతా గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఉదయం 22 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఈ ఉదయం 33 అడుగులకు చేరింది. సాయంత్రానికి 40 అడుగుల వరకూ నీటిమట్టం పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరికి వరదనీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన భారీ యంత్రాలు వరద నీటిలో మునిగాయి.

నది వరద క్రమంగా స్నాన ఘట్టాలకు చేరుకోవడంతో, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన రామ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లన్నీ ఎత్తివేశారు. సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 18.4 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న వైరా రిజర్వాయర్ లో ప్రస్తుతం 18.2 అడుగుల మేరకు నీరు నిలిచివుంది. జన్నారం మండలంలో ఇందన్ పల్లి అప్రోచ్ వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

More Telugu News