parkar solar probe: రేపటికి వాయిదాపడ్డ నాసా ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ ప్రయోగం

  • అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వెల్లడి
  • ఆదివారం ఉదయం 4.28 గంటలకు ప్రయోగిస్తాం
  • వాతావరణ పరిస్థితులు 60 శాతం అనుకూలంగా ఉంటేనే ప్రయోగం 

సూర్యుడి గురించిన ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సిద్ధం చేసిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ రోబోటిక్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా పడింది. వాస్తవానికి శనివారం తెల్లవారుజామున 3.53 గంటలకు దీనిని ప్రారంభించాలని నాసా నిర్ణయించింది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 4.28 గంటలకు ప్రయోగిస్తామని నాసా ప్రకటించింది.

వాతావరణ పరిస్థితులు అరవై శాతం అనుకూలంగా ఉంటేనే రేపు ఉదయం వ్యోమనౌకను నింగిలోకి పంపుతామని స్పష్టం చేసింది. చివరి నిమిషంలో గ్యాసియన్ హీలియం అలారమ్ మోగడంతో శనివారం తెల్లవారుజామున జరగాల్సిన ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు నాసా అధికారులు చెబుతున్నారు.

కాగా, సూర్యుడి బాహ్య వాతావరణ వలయం కరోనాలో దాదాపు ముప్పై లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వలయంలోకి  తొలిసారిగా పార్కర్ సోలార్ ప్రోబ్ రోబోటిక్ వ్యోమనౌకను కేప్ కెనెవెరాల్ నుంచి నింగిలోకి పంపేందుకు నాసా పార్కర్ ప్రోబ్ వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ వ్యోమనౌక సూర్యుడి ఉపరితలానికి అత్యంత సన్నిహితంగా 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళుతుంది. ఇతర ఉపగ్రహాల కన్నా రేడియో ధార్మికతను ఐదు వందల రెట్లు ఎక్కువగా తట్టుకోగలుగుతుంది.

More Telugu News