kamal: చెన్నై లో భారీ వసూళ్లను రాబట్టిన 'విశ్వరూపం 2'

  • గతంలో హిట్ కొట్టిన 'విశ్వరూపం'
  • సీక్వెల్ గా వచ్చిన 'విశ్వరూపం 2'
  • తొలిరోజున భారీ వసూళ్లు

కమలహాసన్ కథానాయకుడిగా రూపొందిన 'విశ్వరూపం 2' నిన్ననే భారీస్థాయిలో థియేటర్లకు వచ్చింది. దేశభక్తి నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. గతంలో వచ్చిన 'విశ్వరూపం' ఘన విజయాన్ని సాధించడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ముఖ్యంగా చెన్నై నగరంలో ఈ సినిమా తొలి రోజున అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది. చెన్నైలో తొలిరోజున 92 లక్షలు రాబట్టి, ఈ ఏడాది ఇంతవరకూ వచ్చిన చిత్రాలలో ఉత్తమమైన వసూళ్లను సాధించిందని అంటున్నారు. చెన్నై నగరంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచినట్టు చెబుతున్నారు. అమెరికా .. ఆస్ట్రేలియాలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. కమల్ అద్భుత నట విన్యాసం ఈ సినిమాకి హైలైట్ గా నిలవగా, పూజా కుమార్ .. ఆండ్రియా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమల్ ఎన్నో కష్టాలుపడి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమా, ఆయనకి ఏ స్థాయిలో సంతృప్తిని కలిగిస్తుందో చూడాలి.      

More Telugu News