Jagan: అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా?: జగన్ కు కళా వెంకట్రావు లేఖ

  • ఈడీ ఛార్జ్ షీట్ కు, టీడీపీకి సంబంధం ఏమిటి?
  • అక్రమాస్తులను పేదలకు పంచి, భారతిని కేసుల నుంచి విముక్తి చేయండి
  • బీజేపీతో లాలూచీ వల్లే కేసులు నత్తనడకన నడుస్తున్నాయి

అక్రమాస్తుల కేసు ఛార్జ్ షీట్ లో వైయస్ భారతి పేరును ఈడీ చేర్చడానికి, టీడీపీకి సంబంధం ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈడీకి, టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అక్రమాస్తులన్నింటినీ పేదలకు పంచి, భారతిని కేసుల నుంచి విముక్తి చేయాలని జగన్ కు సూచించారు. ఈ మేరకు జగన్ కు ఆయన లేఖ రాశారు. ఆరు పేజీల లేఖలో జగన్ కు 23 ప్రశ్నలను కళా వెంకట్రావు సంధించారు. అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

అవినీతి ఆస్తిని భార్య పేరుపై ఎందుకు పెట్టారంటూ లేఖలో కళా వెంకట్రావు ప్రశ్నించారు. అవినీతి కేసులో భారతి పేరు నమోదైతే, టీడీపీకి ఏం సంబంధమని అడిగారు. అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడి బెయిల్ తెచ్చుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అక్రమాస్తుల కేసు నత్తనడకన నడుస్తున్నదానికి బీజేపీతో లాలూచీ కారణం కాదా? అని అన్నారు. బీజేపీతో ఉన్న లాలూచీ వల్లే వైసీపీ ఎంపీలు అవిశ్వాసానికి ముందే రాజీనామాలను ఆమోదించుకున్నది వాస్తవం కాదా? అని అడిగారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేశారని విమర్శించారు. మీ అవినీతి కేసుల్లో ఐఏఎస్ అధికారులు కూడా చార్జిషీట్లను ఎదుర్కొన్న విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు.  

More Telugu News