Pakistan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి నేను వెళ్లడం లేదు: సునీల్ గవాస్కర్

  • ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడి
  • ఇమ్రాన్ కు శుభాకాంక్షలు తెలిపిన సన్నీ
  • పాక్ కు వెళ్లనున్న సిద్ధూ, కపిల్ దేవ్

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను వెళ్లడం లేదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తెలిపారు. ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందినప్పటికీ.. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగానే ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 18న పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నఇమ్రాన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఓ మీడియా ఛానెల్ తో గవాస్కర్ ఈ రోజు మాట్లాడుతూ.. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా తాను ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ గురించి ఇమ్రాన్ అర్థం చేసుకున్నంతగా మరే పాక్ నాయకుడు అర్థం చేసుకోలేదని గవాస్కర్ తెలిపారు. ఓ క్రికెటర్ పాకిస్తాన్ ప్రధాని కానుండటం గర్వించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు.

తాను భవిష్యత్ లో రాజకీయాల్లోకి రానని మరో ప్రశ్నకు గవాస్కర్ సమాధానమిచ్చారు. గవాస్కర్, ఇమ్రాన్ ఇద్దరూ 1971లోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టారు. గవాస్కర్ 1987లో ఆటకు గుడ్ బై చెప్పగా, 1992లో పాక్ కు వన్డే ప్రపంచకప్ అందించిన తర్వాత ఇమ్రాన్ ఆట నుంచి తప్పుకున్నారు. ఆగస్టు 18న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగే ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి పంజాబ్ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ హాజరుకానున్నారు.

More Telugu News