kangana: స్టార్ డమ్ ఇచ్చిందే ప్రజలు.. వారి సమస్యలపై మాట్లాడకపోతే ఎలా?: బాలీవుడ్ తారలపై కంగన ఫైర్

  • కరెంట్, నీటి కొరత లేవని నటులు చెప్పడంపై ఆవేదన
  • ఇది దారుణమైన పరిస్థితి అని వ్యాఖ్య
  • ప్రజా సేవకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని వెల్లడి

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కంగన.. తాజాగా తోటి నటుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని కొందరు నటులు తమకు కరెంట్, నీటి కొరత లేవని, అలాంటప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడంపై మండిపడింది. సినీనటులు ప్రజా సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధించిన విజయాలకు అర్థం ఉండదని స్పష్టం చేసింది.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ..‘‘దేశంలో స్టార్ డమ్ ఉన్న మమ్మల్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు ఎగబడుతుంటారు. అలాంటి తారలు సామాజిక సమస్యలపై మాట్లాడకపోతే వారు సాధించిన స్టార్ డమ్ కు అర్థం ఉండదు. ‘మాకు కరెంట్, నీటి కష్టాలు లేవు. మేమెందుకు ప్రజల సమస్యలపై మాట్లాడాలి?’ అని కొందరు స్టార్ నటులు నాతో చెప్పారు. అది వినగానే చాలా బాధేసింది. మాకు స్టార్ డమ్ ఇచ్చిందే ప్రజలు. వారి సమస్యలపై మాట్లాడకపోతే ఎలా? ఇది దారుణం’’ అని కంగన మండిపడింది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

More Telugu News