jagan: వైయస్ భారతిపై ఈడీ ఛార్జ్ షీట్ కు, టీడీపీకి ఏమి సంబంధం?: యనమల

  • ఈడీ కేసులో జగన్ వాదన విచిత్రంగా ఉంది
  • ఆయన వల్ల ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది
  • కేసు నుంచి సానుభూతిని పొందేందుకు జగన్ యత్నిస్తున్నారు

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య భారతిపై ఈడీ ఛార్జ్ షీట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా? అంటూ జగన్ ఓ బహిరంగ లేఖను రాశారు. ఈడీ కేసులో భారతి ముద్దాయి అంటూ ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను చూసి నిర్ఘాంతపోయానంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖపై మంత్రి యనమల విమర్శలు గుప్పించారు.

ఈడీ కేసుకు సంబంధించి జగన్ చేస్తున్న వాదన చాలా విచిత్రంగా ఉందని యనమల అన్నారు. ఈ కేసుకు సంబంధించి కుటుంబసభ్యుల ప్రమేయం ఉందో, లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈడీ ఛార్జ్ షీట్ కు, టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసు ద్వారా సానుభూతిని పొందేందుకు జగన్ యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి వల్ల ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని చెప్పారు. లేనిది ఉన్నట్టు రాస్తే తప్పు పట్టాలి కానీ, ఉన్నది ఉన్నట్టు రాస్తే తప్పు ఎలా అవుతుందని అన్నారు. ఛార్జ్ షీట్ లో భారతి పేరు ఉందని జగన్ అడ్వొకేట్లే చెబుతున్నారని తెలిపారు. 

More Telugu News