Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో కుప్పకూలిన ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కు అంతరాయం!

  • బస్తీ జిల్లాలో ఈ ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం
  • ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు
  • ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలంటూ యోగి ఆదేశం

ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ ఈ ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో... ప్రాణ నష్టం తప్పింది. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల... ఫ్లైఓవర్ కు సపోర్ట్ గా ఉంచిన ఐరన్ బీమ్ లు భూమిలోకి కుంగిపోయాయని, దీనివల్లే ఫ్లైఓవర్ కుప్పకూలిందని చెప్పాడు.

లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో 28వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ... కూలిపోయిన ఫ్లైఓవర్ అవశేషాలను వెంటనే ఆ ప్రాంతం నుంచి తొలగించాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News