మరోసారి టీడీపీని ఎన్నుకొంటే జరిగేది ద్రోహమే!: పవన్ కల్యాణ్

10-08-2018 Fri 21:36
  • 2019 ఎన్నికలు చాలా కీలకం
  • కులాల మధ్య చిచ్చుపెట్టి, విభజించడం సీఎం విధానం
  • ప్రజలు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నారు!
2019 ఎన్నికలు చాలా కీలకమని, మరోసారి టీడీపీని ఎన్నుకొంటే జరిగేది ద్రోహమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోరాట యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

‘రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, విభజించడం ముఖ్యమంత్రి విధానం. కాపులకి-బీసీలకీ, మత్స్యకారులకీ-ఎస్టీలకీ, వర్గీకరణ పేరిట ఎస్సీల మధ్య చిచ్చు రగిల్చారు. ‘జనసేన‘ ఎప్పుడూ ఇలాంటి విభజన రాజకీయాలు చేయదు. అన్ని కులాలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని జనసేన విశ్వసిస్తుంది. నాపై ముఖ్యమంత్రి కులం ముద్ర వేయాలని చూస్తున్నారు. అన్ని కులాల మధ్య సామరస్యం కావాలని అనుకొనేవాణ్ణి నేను. అందరికీ సమ న్యాయం జరగాలి అనుకొంటాను.

నేను కులాన్ని నమ్ముకొని రాలేదు. కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఏం జరుగుతోంది? ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు ఇచ్చే రుణాలకీ మాముళ్ళు వసూళ్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నారు. ఒకటి చంద్రబాబు కుటుంబం. మరొకటి జగన్ కుటుంబం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
రోజుకో మాట మార్చడం ముఖ్యమంత్రి చంద్రబాబుకి అలవాటేనని, రాబోయే రోజుల్లో మోదీ, బాబు కలసి గాఢ ఆలింగనం చేసుకున్నా ప్రజలెవరూ ఆశ్చర్యపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘పశ్చిమ గోదావరిలో టీడీపీకి 15కి 15 సీట్లు ఇస్తే ఏం చేశారు? ద్రోహం తప్ప! నరసాపురంలో వశిష్ఠపై వారధి కూడా కట్టలేదు. 1984లో ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ నిర్మించలేదు. ఇది 60 ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గానీ, టీడీపీగానీ ఏమీ చేయలేదు. గోదావరిని పూజిస్తూ, పుష్కరాలు చేసి బోలెడు ఖర్చు చేసే ప్రభుత్వం ఇదే గోదావరి నదిలో రోజుకి 32 టన్నుల చెత్తను వేసి కలుషితం చేస్తోంది. బీజేపీ ‘స్వచ్ఛ భారత్’ అంటుంది... ఇక్కడి బీజేపీ ఎంపీ గంగరాజు ఏం చేస్తున్నారు?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.