Pawan Kalyan: బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నమ్మకం కోల్పోయింది: పవన్ కల్యాణ్

  • నేను బీజేపీని ఎందుకు వెనకేసుకొస్తా?
  • మోదీ ఏమైనా నా స్నేహితుడా?
  • బీసీలకు, కాపులకూ తెలుగుదేశం ద్రోహం చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో మాట తప్పిన భారతీయ జనతా పార్టీ ప్రజల నమ్మకాన్ని, వారి మనసులో స్థానాన్ని కోల్పోయిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోరాట యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ప్రత్యేక హోదా విషయంలో హామీ నిలబెట్టుకోలేదు కనుకనే, మొదటి రోజు నుంచీ మోదీని తప్పుబట్టానని, దీని గురించే కాకినాడ సభలో విమర్శించి, ప్రకటించిన ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలతో సమానం అంటే ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కు అనుభవం లేదు అని వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ 'పవన్ కళ్యాణ్ దేశభక్తుడు. సమాజం శ్రేయస్సు కోరుకొనేవాడు' అని చంద్రబాబు అన్నారని, టీడీపీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించగానే మాట మార్చి.. ‘బీజేపీని వెనకేసుకొస్తున్నాడు’ అని కామెంట్ చేస్తున్నారని విమర్శించారు.

‘నేను వాళ్ళని ఎందుకు వెనకేసుకు వస్తాను. మోదీ ఏమైనా నా స్నేహితుడా? నేను ఎప్పుడూ కష్టాల్లో ఉన్న ప్రజలను వెనకేసుకువస్తా. వారి వెన్నంటే నడుస్తా. ప్రజల కన్నీళ్లు తుడుస్తా. జగన్ లా నా దగ్గర కోట్లు లేవు. అయితే, ప్రజలు ఎవరు బాధల్లో ఉన్నా స్పందిస్తా. బీసీలకు, కాపులకీ  తెలుగుదేశం ద్రోహం చేస్తోంది. భీమవరంలో నన్ను బీసీ సోదరులు కలిసి ప్రభుత్వం వారికి చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. జగన్ కూడా మాటలు మారుస్తున్నారు. ఆయన్ని ఏం అడిగినా ‘సీఎం అయ్యాకా’ అంటారు అని విమర్శించారు.

More Telugu News