Telugudesam: టీడీపీకి సంఘీభావం తెలుపుతూ.. ఈ నెల 28న గుంటూరులో ముస్లింల భారీ బహిరంగ సభ!

  • టీడీపీకే ముస్లింల మద్దతు
  • బీజేపీతో వైసీపీ లాలూచీ.. మైనార్టీలకు జగన్ ద్రోహం
  • మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ చైర్మన్లు

తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలుపుతూ ఈ నెల 28న గుంటూరులో ముస్లింల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎం.డి.హిదాయత్ మాట్లాడుతూ, బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తూ, అటు ముస్లిం సమాజానికి, ఇటు రాష్ట్రాభివృద్ధికి తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తటస్థ వైఖరి అవలంబించడం వల్లే బీజేపీ బలపర్చిన ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించగలిగారని అన్నారు.

కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల విజయానికి వైసీపీ ప్రచారం చేసిందని, కాంగ్రెస్ పాలనలో మతకలహాలు చోటుచేసుకునేవని, టీడీపీ పాలనలో ఏనాడూ మతకలహాలు చోటుచేసుకోలేదని అన్నారు. సెక్యూలరిజాన్ని పరిపూర్ణంగా టీడీపీ సంరక్షిస్తోందని, మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి గడిచిన నాలుగేళ్లో రూ.2,800 కోట్ల వరకూ వెచ్చించినట్టు చెప్పారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1,106 కోట్లు కేటాయించారని, ముస్లింలకు అవసరమైన పథకాలు అమలు చేయడమే కాకుండా వాటి అమలులోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని హిదాయత్ అన్నారు. ఏపీ మంత్రివర్గంలోకి ముస్లింలను తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారని, ఇప్పటికే పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా, స్థానిక సంస్థల్లో చైర్ పర్సన్, చైర్మన్లుగా ముస్లింలకు అవకాశమిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ముస్లిం సమాజమంతా టీడీపీకి వెన్నుదన్నుగా ఉందనే విషయం చెప్పడానికే ఈ నెల 28న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సభకు సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, ఇదే సభ ద్వారా ముస్లిం సమాజానికి జగన్ ద్రోహాన్ని ఎండగడతామని అన్నారు.

జగన్ తీరుపై క్రిస్టియన్లు కూడా అసంతృప్తితో ఉన్నారు

ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. మతాలకతీతంగా ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ తీరుపై క్రిష్టియన్లు కూడా అసంతృప్తితో ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలోనే రాష్ట్రంతో పాటు ముస్లిం సమాజం కూడా అభివృద్ధి చెందగలదని ధీమా వ్యక్తం చేశారు.

‘నారా హమారా... టీడీపీ హమారా’

కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా మాట్లాడుతూ, ‘నారా హమారా... టీడీపీ హమారా’ పేరుతో ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసిందని, అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలంతా టీడీపీ వెనకే ఉన్నారని, రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చేపట్టిన పోరాటానికి ముస్లింలు అంతా వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. ఈ 28న జరిగే భారీ బహిరంగ సభను ముస్లింలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

More Telugu News